పవన్ ఆరోగ్యంపై అవేం మాటలు రోజా గారు

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులను అలా పూచిక పుల్లను తీసేసినట్టుగా సంచలన వ్యాఖ్యలు చేయడంలో రోజా దిట్ట అనే చెప్పాలి. టీడీపీతో రాజకీయం మొదలుపెట్టిన రోజా… ఆ తర్వాత కాంగ్రెస్, ఆపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా కూడా రోజా తన రాజకీయ ప్రత్యర్థులపై సెటైరికల్ విమర్శలు గుప్పించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తాజాగా శనివారం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆమె ఇదే తరహాలో అలా సాగిపోయారు. ఈ ఇంటర్వ్యూను చూసిన వారంతా… ఇలాగే ఉంటే కష్టం రోజా గారు అన్న కామెంట్లు పడిపోతున్నాయి.

ఇంటర్వ్యూ ముగియగానే… సదరు ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వరుసగా దర్శనమిచ్చాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలి సమాధానాలు ఇచ్చిన రోజా… జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించిన ప్రస్తావన వచ్చేసరికి రోజా స్పందించిన తీరుపై సెటైర్లు పడుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన విజయం గురించి ప్రస్తావించిన రోజా… పవన్ పై నోరు పారేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే…జనం పవన్ కల్యాణ్ ను లేపి లేపి తన్నారంటూ రోజా ఒకింత అనుచిత వ్యాఖ్యలు చేశారు.

విజయ్ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ పవన్ ను సూటిపోటి మాటలన్నారన్న రోజా… అక్కడితోనే ఆగిపోలేదు. అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ పరిస్థితిని కూడా ఆమె అవహేళన చేసేశారు.

పవన్ ఒళ్లు బాగోలేక ఓ మూల కూర్చున్నారని, అయినా కూడా ఆయనను ట్రోల్ చేసిన విధానంతో తనకు నవ్వాగలేదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ని చూసి నేర్చుకోరా అంటూ నెటిజన్లు పవన్ ను పదే పదే ట్రోలింగ్ చేశారని ఆమె అలా అలా సాగిపోయారు.

రాజకీయం అన్నాక… అందులో కొనసాగుతున్న నేతలుగా పొలిటీషియన్లకు ఓ మోస్తరు సంయమనం అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి? అన్న దాని కంటే కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించకూడడు అన్నదానిపై వారికి సంపూర్ణ అవగాహన అయితే ఉండక తప్పదు.

ఈ తరహా కనీస అవగాహనను ఎప్పుడో వదిలేసిన రోజా… పవన్ పై అసందర్భ వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. పవన్ కు అనారోగ్యం అని తెలిసి కూడా రోజా… ఆయన గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.