హైడ్రా రంగనాథ్‌గా పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, హైడ్రా కమిషనర్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ పెద్దలు, న్యాయవాదులు, నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తక్షణమే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. బీఆర్ ఎస్ సహా.. బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంప పెట్టని కూడా నాయకుడు వ్యాఖ్యానించారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎదురు దాడి చేయడం ప్రారంభించారు. హైడ్రాను సమర్థించారు. దీనిని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. భూకబ్జా కోరులు హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రంగనాథ్ వ్యవహారాన్ని కూడా ఆయన సమర్థిస్తూ .. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అధికారిపై 400 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. హైడ్రా వ్యవస్థను రంగనాథ్ బలోపేతం చేశారని, కబ్జాదారులు ఆయనకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. మొత్తంగా రెండు రోజుల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి న్యాయపరంగానే ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. రంగనాథ్‌ను కాపాడుకునే ప్రయత్నమూ చేశారు.
కానీ.. ఈ ప్రయత్నాలు ఎలా ఉన్నా.. తాజాగా మరోసారి హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్‌ను సాధ్యమైనంత వేగంగా ఆ పదవి నుంచి తప్పించాలని.. వేరే స్థానానికి బదిలీ చేయాలని శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు.. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల ఆధిపత్యానికి తావులేదని.. దీనిని చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. వ్యక్తుల ఆధిపత్యం.. వారి ధోరణి కారణంగా.. ప్రజాస్వామ్యానికే మరణ శాసనం అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ ను త్వరగా ఆ పోస్టు నుంచి తప్పించి.. వేరే వారికి అవకాశం కల్పించాలని తెలిపింది.
63 ధిక్కరణ పిటిషన్లు..
చెరువులు, కుంటల ఆక్రమణలను అడ్డుకోవడంతోపాటు.. మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2024, జూన్‌లో హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చింది. అప్పటి నుంచి దీనికి ప్రత్యేక అధికారాలు కల్పించారు. కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమించారు. అయితే.. కోర్టు సెలవు రోజుల్లోనూ.. తెల్లవారు జాము సమయంలోనూ భూములను స్వాధీనం చేసుకునేందుకు రావడం.. హైడ్రాపై ప్రజలకు వ్యతిరేకత పెంచేలా చేసిందన్న వాదన ఉంది. అయితే.. హైడ్రా వల్ల లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వం స్వాధీనంచేసుకుంది. కానీ హైడ్రాపై మాత్రం ఈ మచ్చ పడింది. ఈ క్రమంలో కోర్టు పలుమార్లు.. నిర్దేశిత వేళల్లోనే వెళ్లాలని, ముందుగానే బాధితులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయా ఆదేశాలను ధిక్కరించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ కేసులు నమోదయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

