తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థుల కరువు

తెలంగాణాలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడంతో ఏమి చేయాలో తోచక  తలపట్టుకుంటున్నాయి. ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ అయిపొయింది. శుక్రవారం నుంచి మూడో విడత చివరి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకోని విద్యార్థులు వెంటనే స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్ లైన్ కేంద్రాలకు వెళ్లాలని యాజమాన్మాన్యాలు బతిమాలుతున్నాయి. అయినా సరే పూర్తి సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని యాజమాన్యాలు దిగులుపెట్టుకున్నాయి.

22,972 సీట్లు ఖాళీ….

తెలంగాణాలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 22,972 సీట్లు మిగిలిపోయాయి. మేనేజ్మెంట్ కోటాకు కూడా భారీగా డిమాండ్ తగ్గినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలాల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 94,424 సీట్లు ఉండగా రెండు విడతలుగా జరిగిన కౌన్సిలింగ్ లో 71,452 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు భర్తీ కావడానికి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కొత్త దారులు వెదుకుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

కన్సల్టెంట్ల వద్దకు పరుగులు …

ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ విషయంలో కన్సలెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. జూనియర్ కాలేజీ నిర్వాహకులు, అక్కడ పనిచేసే లెక్చరర్ల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తుంటారు. అయితే కొన్ని పేరున్న ఇంజనీరింగ్ కళాశాలలు గత కొన్నేళ్లుగా వారిని దగ్గరకు రానివ్వడం లేదు. ఇప్పుడు పరిస్థితి తలకిందులు కావడంతో పెద్ద కాలేజీలు సైతం కన్సల్టెంట్ల వద్దకు పరుగులు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

భారీ ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి…

నిన్నా మొన్నటి దాకా యాజమాన్యం ఇచ్చింది తీసుకొన్న కన్సల్టెంట్ల పంట పండింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో ఐదు సీట్లు భర్తీ చేసిన వారికి రెండు సీట్లు ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎల్బీ నగర్, హయాత్ నగర్ ప్రాంతాల్లోని కాలేజీలు ఒక అడుగు ముందుకేసి ఒకటికీ ఒకటి ఉచితం అంటూ ఊరిస్తున్నట్లు సమాచారం. బాచుపల్లి, నిజాం పేట్, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని కాలేజీలు సైతం మేనేజ్మెంట్ కోటా భర్తీ చేయడానికి కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు.