ఏపీకి తలమానికంగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే… ఏపీకి ఎన్నెన్ని ప్రయోజనాలు లభిస్తాయన్న విషయంపై ఇప్పటికే పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు సమాంతరంగా…భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ఎవరిదన్న విషయంపైనా రచ్చ సాగుతోంది. తొలి చర్చ ఆసక్తి రేకెత్తిస్తుంటే…రెండో రచ్చ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి. ఎవరెన్ని అనుకున్నా.. భోగాపురం ఎయిర్ పోర్టుకు కర్త, కర్మ, క్రియ… అన్నీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడేనని చెప్పక తప్పదు.
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలను వరుస క్రమంలో ఒకింత పరిశీలనగా చూస్తే… భోగాపురం క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పాలి. ఇక భోగాపురాన్ని తానే పట్టాలెక్కించానని చెబుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు సత్యదూరమేనని ఇట్టే తేలిపోతాయన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. వాస్తవాలను మరుగున పెట్టేసి… తమకు అనుకూలంగా ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావించుకుంటూ పోతే… ఎవరి వాదన వారికి కరెక్టుగానే కనిపిస్తుంది. అయితే జరిగిన ఘటనలను వరుస క్రమంలో పరికించి చూస్తేనే కదా అసలు విషయం బయటపడేది.
వాప్తవానికి భోగాపురం ఎయిర్ పోర్టుకు అంకురార్పణ జరిగిందే విశాఖను హుద్ హూద్ ముంచెత్తిన సమయంలో. అంటే…2015లో. నాడు పెను తుఫానుకు విశాఖ చిగురుటాకులా వణికిపోగా…విశాఖ ఎయిర్ పోర్టులోకి నీరు చేరిపోయింది. ఫలితంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులకు అండగా నిలిచే క్రమంలో ఉత్తరాంధ్ర వెళ్లిన నాటి, నేటి సీఎం చంద్రబాబు… కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఆ సమయంలోనే విశాఖ ఎయిర్ పోర్టుకు సమాంతరంగా మరో అంతర్జాతీయ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు భావించారు. ఆ సమయంలోనే అప్పటికే కేంద్రం చేసిన అధ్యయనం గుర్తుకు వచ్చి… దానిని చంద్రబాబు కేంద్రంతో చర్చలు మొదలుపెట్టారు.
కేంద్రం చేసిన అధ్యయనాన్ని పొదివిపట్టేసిన చంద్రబాబు… భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు అనువుగా ఉందని, అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టేయాలని తీర్మానించారు. అనుకున్నంతనే… భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ (బీజీఏసీఎల్) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన నాటి బాబు సర్కారు విమానాశ్రయానికి తొలి అడుగు వేసింది. ఆ వెంటనే ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణను మొదలుపెట్టగా… ప్రజలను రెచ్చగొట్టిన వైసీపీ… భూసేకరణకు అడుగడుగునా అడ్డు పడింది. అయినా ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను నాటి టీడీపీ ప్రభుత్వం 80 శాతం మేర పూర్తి చేసింది. నిర్మాణానికి జీఎంఆర్ తో ఒప్పందం కూడా చేసుకుంది.
అయితే ఈలోగా 2019 సార్వత్రిక ఎన్నికలు రావడం… ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అదికారంలోకి రావడం జరిగిపోయింది. అధికారంలోకి వచ్చీరాగానే… జగన్ ఎయిర్ పోర్టు పనులను నిలుపుదల చేశారు. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న జగన్.. తిరిగి ఎయిర్ పోర్టు నిర్మాణానికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని ఇస్తే… మాకేమిటి లాభం అన్నట్లుగా వ్యవహరించిన జగన్… కాకినాడ సెజ్ లోని జీఎంఆర్ షేర్లను అరబిందోకు బదలాయించాక… జీఎంఆర్ తో మరో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు రాగా… నాటి ప్రభుత్వ ధోరణి కారణంగా ఈ విషయంపై పెద్దగా చర్చే జరగలేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా జగన్ సర్కారు పనులను ప్రారంభింపజేసి… తాను అదికారం నుంచి దిగిపోయే నాటికి కేవలం 26 శఆతం పనులు.. అంటే… విమానాశ్రయం ఫస్ట్ శ్లాబ్ పనులను మాత్రమే పూర్తి చేసింది.
ఇక ఏపీకి రెండోసారి సీఎం కాగానే… చంద్రబాబు భోగాపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తొలి నెలలోనే ఆయన భోగాపురంలో పర్యటించి.. ఎయిర్ పోర్టు ఏపీకి ఎంతటి అవసరమో తెలిపారు. ఇక కేంద్ర కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడే ఉండటంతో ఆయన ఆధ్వర్యంలో పనులు మరింత వేగంగా కదిలాయి. ఏపీలో కూటమి సర్కారు రెండేళ్ల పాలనను పూర్లి చేసుకున్న తరుణంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడం గమనార్హం. వెరసి భోగాపురాన్ని ప్రారంభించిన చంద్రబాబే… దానిని పూర్తి చేశారని చెప్పక తప్పదు. మొత్తంగా ఈ ఎయిర్ పోర్టు క్రెడిట్ మొత్తం కూటమి సర్కారుదేనని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

