తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు ఫ్యూచర్ నిర్మాతలను భయపెట్టేలా చేస్తున్నాయి. వందల కోట్లు పెట్టినా సకాలంలో సినిమా అయిపోతుందనే గ్యారెంటీ లేదు. ఓటిటిలు ఎగబడి కొంటాయన్న నమ్మకం సన్నగిల్లుతోంది. శాటిలైట్ మార్కెట్ ఎప్పుడో తగ్గిపోయింది. డబ్బింగ్ హక్కుల కోసం మునుపటిలా ముంబై చానెల్స్ ఎగబడటం లేదు. ఆచితూచి ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీస్ పడుతున్న సంకటం అంతా ఇంతా కాదు. చిరంజీవి లాంటి సీనియర్ హీరో నటించిన విశ్వంభరకు మోక్షం ఎప్పుడో కనీసం ఆయన పుట్టినరోజుకైనా చెబుతారో లేదో చూడాలి. నిఖిల్ సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్న స్వయంభు పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టితో ప్రశాంత్ వర్మ తీస్తున్న జై హనుమాన్ వచ్చే ఏడాది రిలీజ్ చేస్తే రికార్డేనని దాని స్కేల్ చూసినవాళ్లు మాట్లాడుకుంటున్నారు.
పోనీ డబ్బులు క్రేజ్ పుష్కలంగా ఉన్న వాటికి ఎలాంటి టెన్షన్లు లేవా అంటే వాటికీ బోలెడు ఉన్నాయి. ఫౌజీ టీమ్ కాలి కింద ముళ్ళు పెట్టుకుని డిసెంబర్ 3 విడుదల కోసం అహోరాత్రాలు కష్టపడుతోంది. రాకాని ఎప్పుడు రిలీజ్ కు రెడీ చేయొచ్చనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నకు అట్లీ వద్ద సమాధానం లేదు. రామ్ చరణ్ సుకుమార్ కాంబో సెట్స్ పైకి వెళ్ళేదాకా ఎదురు చూపులు తప్పవు. డ్రాగన్ ఇప్పటికే రెండు మూడు డేట్లు మార్చుకున్నాక తాజాగా తారక్ భుజానికి గాయమై మళ్ళీ టెన్షన్ లో పడింది.
ఒకప్పటిలా రీజనబుల్ బడ్జెట్ లో అయిదారు నెలల్లో సినిమాలు తీసే హీరోలు దర్శకులు ఇప్పుడు దాదాపుగా లేరు. అందరికీ వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్లు కావాలి. లేదంటే జనాలు ఆదరించారేమోనని అనుమానం. ఇవేవీ అవసరం లేదని అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు ఋజువు చేస్తున్నా మిగిలిన దర్శకులు అతన్ని ఫాలో కాలేకపోతున్నారు. ఏ ముహూర్తాన బాహుబలి నుంచి ప్యాన్ ఇండియా అనే పదం వాడుకలోకి వచ్చిందో అప్పటి నుంచి బడ్జెట్లు క్రమంగా తప్పకుండా ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
