కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తాను చదువుతున్న కళాశాలలో ఓ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో బండి కుమారుడు భగీరథ్ అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా ఓ బాలికను వేధించిన కేసులో భగీరథ్ పై ఏకంగా పోస్కో కేసే నమోదు అయిపోయింది. ఈ కేసులో బాదిత బాలిక స్వయంగా భగీరథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఆ బాలికతో పాటు బాలిక కుటుంబంపైనా హనీ ట్రాప్ ఆరోపణలతో భగీరథ్ ఫిర్యాదు చేశారు.
భగీరథ్ పై నమోదు అయిన కేసు వివరాల్లోకి వెళితే… ఇంకా మైనారిటీ కూడా తీరని బాలికతో భగీరథ్ స్నేహంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31న మొయినాబాద్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా బాలిక పట్ల భగీరథ్ అసభ్యంగా వ్యవహరించారట. అంతేకాకుండా ఆ బాలిక మద్యం సేవించేలా బలవంతం చేశారట. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తాజాగా భగీరథ్ పై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గడచిన ఐదు నెలల్లో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ… భగీరథ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్ పై పోస్కో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకునే దిశగా బాలిక, ఆమె కుటుంబం తనను లోబరచుకునే యత్నం చేశారంటూ ఆ బాలికపై భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భగీరథ్ పై కేసు నమోదు, ఐదు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం, తనపై ఫిర్యాదు చేసిన తర్వాత భగీరథ్ బాలిక, ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేయడం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… రాజకీయంగా ఉచ్ఛ స్థితిలో బండి సంజయ్ ఉన్నారు. ఆది నుంచి బీజేపీలో కొనసాగుతున్న బండి… అంచెలంచెలుగా ఎదిగారు. అనూహ్యంగా ఎంపీ కావడం, ఆ వెంటనే ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఒక్కసారిగా బండి సంజయ్ ప్రముఖ నేతగా ఎదిగారు. ఇలాంటి తరుణంలో ఆయన తన కుమారుడి వ్యవహార సరళి వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండగా… ఆయన కుమారుడిపై ఇప్పుడు పోస్కో కేసు నమోదు కావడంతో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates