పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తారో లేదో కానీ ఈలోగా అసలు కథకు సంబంధించిన ట్విస్టులు అన్నీ ఇంకో రెండు వారాల్లో ఆడియన్స్ కి తెలిసిపోతాయి. ఇక్కడ డబ్బింగ్ చేస్తారనే టాక్ ఉంది కానీ హఠాత్తుగా పార్ట్ 3కి వెంకీ కాకుండా మోహన్ లాల్ చేశారంటే మన ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది అనుమానంగానే ఉంది.
ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. రెండు నిమిషాల వీడియోలో కథను చూచాయగా చెప్పారు. శవం దాచి పెట్టిన చోటు దగ్గరికి హీరో మళ్ళీ వెళ్లే అవసరం వస్తుంది. అయిపోయిందనుకున్న కేసుని కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఈ క్రమంలో కొత్త నిజాలు బయటికి వస్తాయి. తన తండ్రి నేరస్థుడనే ముద్ర పిల్లల్లో ఉండకూడదని తపన పడుతున్న హీరో ఈసారి ఏం చేస్తాడు. రెండు కుటుంబాలకు చెందిన తల్లుల గుండెపోటుని ఎలా తీర్చాడనేది అసలు స్టోరీ.
ఈవెంట్ లో మోహన్ లాల్ మాట్లాడుతూ దృశ్యం 3 చివరి భాగం అనుకోవద్దని, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి కొనసాగింపు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హిట్ అయితే దృశ్యం 4 ఉంటుందని లేదా ఇక్కడితో క్లోజ్ అని హింట్ ఇచ్చారు. దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ఎక్కువ ట్విస్టులు ఊహించుకుని రావొద్దని, ఎమోషన్స్ కు పెద్ద పీఠ ఉంటుందని చెబుతూ థ్రిల్ మిస్ అవ్వదని నర్మగర్భంగా చెప్పారు..
మల్లువుడ్ వర్గాల కథనం ప్రకారం దృశ్యం 3నే చివరిది. నిజంగా సక్సెస్ అయినా కూడా స్టోరీ కంటిన్యూ చేసేందుకు స్కోప్ లేకుండా జీతూ జోసెఫ్ ముగింపు పలికారట. అందుకే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నారు. మీనాతో పాటు ఇద్దరు కూతుళ్లుగా నటించిన అమ్మాయిలు ఈ థర్డ్ పార్ట్ లోనూ కొనసాగుతున్నారు. వెంకటేష్ అభిమానులు ఇక్కడా రీమేక్ కావాలని కోరుకుంటున్నారు. ఆదర్శ కుటుంబం, రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న వెంకీ అది నెరవేరుస్తారో లేదో.
Gulte Telugu Telugu Political and Movie News Updates