అమెరికా పెద్ది గురించి ఇండియాలో చర్చ

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ఇప్పుడొక అవసరం లేని టాపిక్ గురించి చర్చలోకి వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ, టికెట్ రేట్ ముప్పై ఎనిమిది డాలర్లు ఉండటం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వదిలిన వీడియో వైరల్ కావడంతో జనాలకిదో డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. దీని గురించి అక్కడి డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ ఇస్తూ XD లాంటి ప్రీమియర్ స్క్రీన్లలో మాత్రమే కొంత ఎక్కువ ధర ఉంటుందని, మిగిలిన చోట్ల ఎప్పటిలాగే 20 డాలర్ల నుంచి మొదలవుతుందని వివరాలతో ఒక ట్వీట్ వేశారు.

నిజానికి ఈ ధరలు కొత్త కాదు. గతంలో దేవర, కల్కి, ఆర్ఆర్ఆర్ టైంలోనూ ఉన్నవే. అంతెందుకు ఎప్పుడో వచ్చిన ఆగడుకి కూడా పదిహేను డాలర్లకు పైగానే రేట్ పెట్టారు. మార్కెట్ పరిస్థితులు, సినిమా బడ్జెట్ ని బట్టి పంపిణీదారులు రిస్కులన్నీ లెక్కవేసుకుని రేట్లు నిర్ణయించుకుంటారు. అలాని ఇదేదో సమర్ధించే ప్రయత్నం చేయడం కాదు. చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాల రికవరీ కావాలంటే ఈ స్ట్రాటజీతో వెళ్లడం తప్ప వేరే మార్గం ఉండటం లేదు.

వచ్చే నెల ఇండియాలోనూ ముందు రోజు ప్రీమియర్ షోలకు ఎనిమిది వందలు లేదా వెయ్యి రూపాయలు టికెట్ రేట్ పెడతారు. అలాని ఫ్యాన్స్ చూడటం మానుకోవడం లేదు. ఓజికి వెయ్యి అన్నా చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకే గుడిలో ఫ్రీ దర్శనం నుంచి పది వేల రూపాయల టికెట్ల దాకా రకరకాల ధరలు ఉంటాయి. భక్తుడి ఆర్ధిక స్థోమతని బట్టి కొనాలా వద్దా చూసుకుంటారు. క్రమంగా ప్రొడ్యూసర్లు దేవాలయాలుగా భావించే థియేటర్లు కూడా అలాగే మారిపోతున్నాయి.

హిందీ సినిమాలు రెగ్యులర్ రేట్లతో వెళ్లడాన్ని ట్విట్టర్ లో కొందరు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా దురంధర్ లాంటివి మాములు ధరలతో వసూళ్లు కొల్లగొట్టాయి. ఈ పోలిక సరైంది కాదు. ఎందుకంటే హిందీ సినిమాల మార్కెట్ చాలా పెద్దది. యుఎస్ నుంచి కెనడా దుబాయ్ దాకా భారీ ఆడియన్స్ బేస్ ఉంటుంది. కానీ తెలుగు తమిళ చిత్రాలకు అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఆ పద్దతి ఫాలో కాలేరు. ఎప్పుడూ లేనిది కేవలం పెద్ది విషయంలో ప్రశ్నలు లేవనెత్తుతున్న ధోరణి మీద మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.