విజ‌య్ సీఎం అయ్యాడు.. మ‌రి రాహుల్ ప్ర‌ధాని ఎప్పుడో?!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు లోక్ స‌భలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. వేదికపై విజయ్ పక్కనే రాహుల్ గాంధీ కూడా కూర్చున్నారు. కార్యక్రమం ఆశాంతం చాలా ఉత్సాహభరితంగా ఆయన కనిపించారు. కార్యక్రమం అనంతరం నూతన ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగారు. అయితే ఈ సందర్భంగా సభకు విచ్చేసిన కాంగ్రెస్ నాయకుల్లో ఆసక్తికర చర్చ ఒకటి తెర‌మీదకు వచ్చింది.

రెండేళ్ల కిందట పార్టీ పెట్టిన విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారని.. మరి మా నాయకుడు ప్రధానమంత్రి ఎప్పుడు అవుతాడని కొంతమంది నాయకులు గుసగుసలాడుకోవడం సభలో కనిపించింది. ఈ విషయాలను స్థానిక మీడియా గుర్తించి ప్రసారం చేయటం విశేషం.

ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 2004వ సంవత్సరం నుంచి కోరుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమేనని పదేపదే చెప్పారు. అదే విధంగా తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకులు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న వాదనను వినిపించారు.

తమిళనాడులో కూడా ఇదే తరహా నాయకులు చాలామంది ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని.. ఆశించే నేతలు తమిళనాడులో ఎక్కువ మందే కనిపిస్తారు. తాజాగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సీనియర్ నాయకుల్లో కూడా ఇదే తరహా చర్చ నడిచింది.

కేవలం, రెండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన విజయ్ ఇప్పుడు అనూహ్యంగా అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయని కానీ దాదాపు పుష్కర కాలంగా రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఎటు ముందుకు సాగడం లేదన్నది వారి మధ్య జరిగిన సంభాషణలో వినిపించింది.

అంతేకాదు, సమీప భవిష్యత్తులో అయినా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని విస్మయం కూడా వారి మాటల్లో దొర్ల‌డం విశేషం. రాజకీయాల్లో ఇటువంటి చర్చలు కామన్ గా జరుగుతున్నప్పటికీ.. రాహుల్ గాంధీ గురించి తరచుగా ఈ చర్చ తెరమీదకు రావడం ఆసక్తిగా మారింది. మరోవైపు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు రాహుల్ గాంధీకి అవకాశం ద‌క్క‌ద‌న్న వాదన సోషల్ మీడియాలో వినిపించటం విశేషం. ఏదేమైనా విజయ్ కి -రాహుల్ కి లింకు పెడుతూ సాగిన ఈ చర్చకు సంబంధించి సోషల్ మీడియాలోనూ ఆసక్తికర కామెంట్లు పడ్డాయి.