ఏపీలో పెట్రోల్‌, డీజిల్ కొర‌త… నిజ‌మేనా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. దేశ‌వ్యాప్తంగా కొన్నాళ్ల కింద‌ట పెట్రోలు, డీజిల్‌కు కొరత ఏర్ప‌డుతుంద‌న్న అంచ‌నాలు వ‌చ్చాయి. కానీ, వాటిని అధిగ‌మించేలా కేంద్రం వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు ఇత‌ర దేశాల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దిగుమ‌తి చేసుకుని.. కొర‌త‌కు అవ‌కాశం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో కొర‌త ఏర్ప‌డిన మాట వాస్త‌వ‌మే.

రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు, ప‌శ్చిమ‌ గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు గ‌త రాత్రి నుంచి సేవ‌లు నిలిపివేశాయి. `నో స్టాక్’ బోర్డులు పెట్టారు. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా స‌ర్కారును తాకింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు కూడా రోడ్ల మీద‌కి వ‌చ్చారు. బంకుల వద్ద బారులు తీరారు. దీనిపై వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

స‌ర‌ఫ‌రా ఉంది.. ధ‌ర‌లే పెరిగాయి..

అయితే.. రాష్ట్రంలో స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. అయితే క్రూడాయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో  కంపెనీలు నిలుపుద‌ల చేశాయ‌ని అధికారులు చంద్ర‌బాబుకు తెలిపారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే బ‌కాయిలు ఉన్న బంకుల‌కు.. స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని.. అప్పులు ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై విస్మ‌యం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ద్వారా.. సాధ్య‌మైన‌న్ని చోట్ల బంకులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాద‌ని అధికారులు చెప్పారు. ఉన్న బంకుల్లోనే 24 గంట‌లు సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉద‌యం 8 నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు పౌర‌స‌ర‌ఫ‌రాలు, పోలీసుల ఆధ్వ‌ర్యంలో న‌డిచే బంకుల‌ను ఇక నుంచి 24 గంట‌లు న‌డిపేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. స‌మ‌స్యను ప‌రిష్క‌రించేందుకు క‌లెక్ట‌ర్లు జోక్యం చేసుకోవాల‌ని.. అస‌వ‌ర‌మైతే.. ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.