ప‌త్తికొండ రాజ‌కీయం యూట‌ర్న్‌.. ఎందుకిలా?

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ దూకుడును త‌ట్టుకుని టీడీపీ విజ‌యం సాధించిన సంద‌ర్భాలు ఉన్నా.. త‌ర్వాత కాలంలో మాత్రం.. ఓడుతూ వ‌చ్చింది. కానీ, ప‌త్తికొండ‌లో మాత్రం 1994 ఎన్నిక‌ల నుంచి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ విజ‌యం సాధించింది. నాయ‌కులు మారినా.. పార్టీ పునాదులు ఎక్క‌డా స‌డ‌లిపోలేదు. 1994 నుంచి 2004 వ‌ర‌కు ఎస్వీ సుబ్బారెడ్డి విజ‌యం సాధించారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రులు వ‌రుస విజ‌యాలు సాధించి టీడీపీ జెండా ఎగ‌రేశారు. పైగా వీరి దూకుడుతో కాంగ్రెస్ నాయ‌కులు చాలా మంది టీడీపీలోకి చేరిపోయారు. ఫ‌లితంగా కాంగ్రెస్ జెండా ప‌ట్టుకునే నాయ‌కులు కూడా ఇక్క‌డ క‌రువ‌య్యారు.

కానీ, చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి దూకుడును మాత్రం కేఈ కుటుంబం నిలువ‌రించ‌లేక పోయింది. కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న తుదికంటా హ‌వా చ‌లాయించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పారు. అనూహ్యంగా ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌తీమ‌ణి శ్రీదేవికి జ‌గ‌న్ టికెట్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో తొలి టికెట్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా గ‌త ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.. టీడీపీ రాజ‌కీయాల‌ను యూట‌ర్న్ తీసుకునేలా చేసింది. ఇక్క‌డ కీల‌క‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని అనుకున్న చంద్ర‌బాబు కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు శ్యాం బాబుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. పైగా చెరుకుల‌పాడు హ‌త్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలావుంటే.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన శ్రీదేవి.. ఆదిలో ఒకింత దూకుడు రాజ‌కీయాలు చేసినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం తాను త‌ప్పుకొని త‌న కుమారుడు, అల్లుడుకు ప‌గ్గాలు అప్ప‌గించార‌నే వాద‌న వినిపిస్తోంది. వారే ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పుతార‌ని అనుకున్న కేఈ కుమారుడు, ఆయ‌న ఫ్యామిలీ మౌనం పాటిస్తున్నారు. శ్రీదేవి దూకుడుతో వీరు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యార‌ని అంటున్నారు. దీంతో కేఈ కుటుంబం రాజ‌కీయాలు ఇక్క‌డ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. పైగా టీడీపీ త‌ర‌ఫున జెండా మోసే వారు కూడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. గెలిచిన నాయ‌కురాలు శ్రీదేవి అయినా.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారా? అంటే.. అదీ లేదు.

ఇటు టీడీపీ నేత‌లు.. అవ‌కాశం ఉండి కూడా జోరు చూపించ‌లేక పోతున్నారు. దీంతో టీడీపీ నేత‌లు యూట‌ర్న్ తీసుకోవ‌డం.. పార్టీ జెండా మోసే నాయ‌కులు కూడా క‌నిపించ‌క పోవ‌డం.. గ‌త ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా చ‌క్రం తిప్పిన‌ కృష్ణ‌మూర్తి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం వంటివి.. టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు కూడా ఇక్క‌డి ప‌రిస్థితిని ప‌ట్టించుకోక పోవ‌డం మ‌రో కీల‌క‌మైన విష‌యం. మ‌రి ఎప్ప‌టికి ఇక్క‌డి ప‌రిస్థితి మారుతుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.