జనసేన తరఫున గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాపాక స్టయిలే.. వేరుగా ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. జనసేన తరఫున గెలిచిన తర్వాత.. కేవలం నాలుగు నెలల్లోనే ఆయన వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. కేవలం కండువా మాత్రమే కప్పుకోలేదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల కంటే.. కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన వైసీపీ నేతగా చలామణి అవుతూ.. ఇప్పటికే ఉన్న వైసీపీ నాయకులను డమ్మీలు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాపాక ధోరణిని గమనించిన నాయకులు.. ముందు వేలు పెట్టారు.. తర్వాత.. తల పెట్టారు.. పోనీలే అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గంలో వైసీపీని కబ్జా చేశారంటూ.. వ్యాఖ్యలుసంధిస్తున్నారు. దీనికి కూడా రీజన్ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం.. రాపాక.. ఏకంగా తన కుమారుడు రాపాక వెంకట్రామయ్య ఉరఫ్.. వెంట్రామ్‌ను వైసీపీలోకి చేర్చేశారు. యువ నాయకుడు.. ఇంకా మూడు పదులు కూడా వయసు నిండని ఉడుకు నెత్తురు కావడంతో జగన్ ఆయనను వెంటనే పార్టీ లోకి చేర్చేసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు రాపాక ప్రతిపాదనతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలను తన కుమారుడికి ఇస్తే.. పార్టీని గెలిపించే బాధ్యత తనే తీసుకుంటానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణద్వారా.. జిల్లా వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ కొట్టించారట. దీనిపై వైవీ సమాధానం చెప్పకపోయినా.. ఒక అడుగైతే.. రాపాక నుంచి పడింది.
అంతటితో ఆయన ఆగకుండా.. ప్రస్తుతం నియోజకవర్గంలో అటు బొంతు రాజేశ్వరరావు, ఇటు పెదపాటి అమ్మాజీలు నిత్యం కొట్టుకుంటున్నారని.. దీంతో పార్టీ బలోపేతం కావడం లేదని.. తనైతే.. పార్టీని ముందుకు నడిపిస్తానని కూడా హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో వేలుతో మొదలైన రాపాక రాజకీయం .. కబ్జావరకు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.