‘మా బాస్ కేసీఆర్’… ఈటల కామెంట్లు వైరల్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమ నేతగా, సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ కు సేవలందించిన సీనియర్ పొలిటిషియన్ గా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, గులాబీ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.

అయితే, రాజకీయ పరిణామాలు, రకరకాల ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారు. అయితే, బీజేపీ ఎంపీ అయిన ఈటలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదని, ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే మల్కాజ్ గిరిలో జరిగిన ఓ సభలో ఈటల చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మర్రి రాజశేఖర్ రెడ్డి బాస్…అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల అనగానే సభా ప్రాంగణమంతా హోరెత్తింది. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ జనం నినాదాలు చేశారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఈటల ఎంపీ హోదాలో శంకు స్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టే పనులన్నింటికీ కేంద్రం నుంచి నిధులను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ…రాజశేఖర్ రెడ్డి బాస్…అదే మా బాస్ అంటూ ఈటల ఆ కామెంట్లు చేశారు.

దీంతో, ఈటల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంచి వక్తగా, బ్యాలెన్సెడ్ గా మాట్లాడతారని పేరున్న ఈటల నోట కేసీఆర్ మా బాస్ అని రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఈటల బీఆర్ఎస్ లో చేరతారని, అందుకే ఇలా మాట్లాడారు అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.