వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తమను బెదిరించారని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో నందిగం సురేష్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అధికారంలో లేకపోయినా సరే సురేష్ తీరు మారినట్లు కనిపించడం లేదు. తనకు ఇవ్వాల్సిన అప్పు అడిగినందుకు చంపేస్తానని నందిగం సురేష్ బెదిరిస్తున్నారని జగదీష్ అనే వైసీపీ కార్యకర్త చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
అంతేకాదు, తనకు, తన కుటుంబానికి సురేష్ దంపతుల నుంచి ప్రాణహాని ఉందని జగదీష్ రాసిన లేఖ సంచలనం రేపుతోంది. తన భార్యను మాస్ రేప్ చేయిస్తానని కూడా సురేష్ బెదిరించారని ఆరోపిస్తూ జగదీష్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఏడాదిగా తనను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తనను చంపినా పర్వాలేదని, చివరకు తెగించి ఈ వీడియో చేస్తున్నానని అన్నారు.
2019 ఎన్నికల సమయంలో సురేష్ కు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్ అభిమానిని అని, వేరే పార్టీకి చెందిన వ్యక్తిని కాదని జగదీష్ అంటున్నారు. జగన్ పై అభిమానంతోనే సురేష్ కు డబ్బులిచ్చానని చెబుతున్నారు. తనను ఎప్పటికైనా చంపుతానని సురేష్ బెదిరిస్తున్నారని, తనపై భౌతిక దాడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ లేఖలో ఆరోపించారు. ఒకవేళ తాను చనిపోతే ఈ లేఖను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని కోరారు.
ఇక, ఈ వీడియో వైరల్ కావడంతో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. నందిగం సురేష్, జగదీష్ ల మధ్య రాజీ కుదిర్చారు. జగదీష్ కు నందిగం సురేష్ ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదిర్చారు.
రాజీ కుదరడంతో జగదీష్ తో పాటు అతడి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగి, తన వాట్సాప్ స్టేటస్ లో నందిగం సురేష్ పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates