పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. బుధవారం నుంచి(ఈ నెల 28) ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో జరిగే ఈ సమావేశాలు.. కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. వచ్చే ఏప్రిల్-మే మధ్య 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టులు వంటివి తాజా బడ్జెట్‌లో ఉంటాయన్న చచ్చ సాగుతోంది. ఎందుకంటే.. గత 2025-26 బడ్జెట్‌ను చూస్తే.. ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించింది.
గత ఏడాది కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీహార్‌కు భారీ ప్రాజెక్టులు కేటాయించారు. అంతేకాదు.. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని నిధుల కింద రూ.10 వేల కోట్లను కేంద్రం కేటాయించి.. వెంటనే మంజూరు చేసింది. అలాగే.. నాలుగు విమానాశ్రయాలను కొత్తగా ఇచ్చింది. ఇక, మహిళలకు ప్రత్యేకంగా సంవత్సరానికి 10 వేల చొప్పున ఇచ్చే నిధులను కూడా కేంద్ర బడ్జెట్‌లోనే చూపించడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక, `పూర్వోదయ` పేరుతో ప్రకటించిన పథకంలోనూ సంబంధం లేకపోయినా.. బీహార్‌ను చేర్చడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. మొత్తంగా బీహార్ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు.. కేంద్ర బడ్జెట్‌లో కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ఇలానే.. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో(తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు.. ఆయా రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండడం గమనార్హం.
ఫిబ్రవరి 1(ఆదివారం)న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక(2026-27) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేటాయింపులు జరిగి ఉంటాయని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు, విశ్లేషకుల్లోనూ చర్చసాగుతుండడం గమనార్హం.
ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం లపై.. బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. అసోంలో ఇప్పటికే అధికారంలో ఉండగా.. మిగిలిన రాష్ట్రాల్లో 40 శాతం మేరకు ఫర్వాలేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపుల ద్వారా.. ఆయా రాష్ట్రాల ప్రజలను మచ్చిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates