అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.. మంచిదేనా?

వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు ప్రాధాన్యం పెరిగింది. తద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుని సమర్థవంతమైన ఉత్పత్తులకు అవకాశాలు కల్పించారు.

అయితే చిత్రంగా గత రెండు ఏళ్ల నుంచి వృత్తి నైపుణ్యం పొందుతున్న వారు విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారత్‌కు వృత్తి నిపుణుల కొరత వెంటాడుతోంది.

ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా అమెరికా నుంచి వృత్తి నిపుణులు తిరిగి భారత్‌కు వచ్చేస్తున్నారు. అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా అక్కడ ఇమడలేని నిపుణులు భారత్ బాట పడుతున్నారు. ఇక్కడే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత రెండు నెలల్లో 30 వేల మంది నిపుణులు తమ అర్హతలతో ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించినట్టు అసోచామ్ వెల్లడించింది. వీరి రాక మరింత పెరుగుతుందని కూడా తెలిపింది.

ఇదే విషయాన్ని లింక్‌డిన్ కూడా వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్‌కు తిరిగి వచ్చిన సాంకేతిక నిపుణుల సంఖ్య 40 శాతం పెరిగినట్టు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా వలసలపై ఉక్కుపాదం మోపడంతో అక్కడ ఉండలేక నిపుణులు తిరిగి వస్తున్నట్టు లింక్‌డిన్ పేర్కొంది. హెచ్–1బీ వీసా నిబంధనలు, లక్ష డాలర్లకు పెరిగిన ఫీజు వంటి అంశాలు భారతీయులకు ఇబ్బందిగా మారినట్టు తెలిపింది.

మంచిదేనా?

అమెరికాను విడిచి భారత్‌కు వస్తున్న నిపుణుల సంఖ్య గణనీయంగా పెరగడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా స్వదేశీ కంపెనీల లావాదేవీలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతుందని కూడా చెబుతున్నారు.

అయితే ఈ పరిణామంతో ఔత్సాహిక వృత్తి నిపుణులకు కొంతమేర ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. డిమాండ్ పెరగడంతో వేతనాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.