సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నైనీ కోల్ బ్లాక్ కోసం పిలిచిన టెండర్లను కూడా రద్దు చేశారు. ఆ వ్యవహారంపై తాజాగా గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మను బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్…సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన బావమరిది కళ్ళల్లో ఆనందం చూడటానికి సింగరేణిని గుత్తకు రేవంత్ రెడ్డి రాసిచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్, ఆయన సోదరులు కలిసి హిల్ట్ స్కాంతో హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆ దోపిడీ సరిపోలేదని, అందుకే బామ్మర్దికి సింగరేణి అప్పణంగా అప్పజెప్పాలని చూశారని ఆరోపించారు.
సింగరేణి కుంభకోణాన్ని సీబీఐ లేదా సిట్‌కు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకోవాలని గవర్నర్ ను కోరామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియా అనే పరిస్థితి వచ్చిందని, ఈ కుంభకోణంపై తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వలేదని అన్నారు.
సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణలపై స్పందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి…అదే సింగరేణి నిధులు 10 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారని, ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి అంశంలో తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమకు మాటిచ్చారని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ న్యాయం జరగకుంటే సింగరేణి కార్మికులను చైతన్య పరుస్తామని అన్నారు.
ఆధారాలతో ఆ స్కాం గుట్టురట్టు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలలో వణుకు మొదలైందిని అన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో ఒక్కొక్కరిని పిలుస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా సింగరేణి టెండర్లలో నిబంధనలు పెట్టారని విమర్శించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి స్కాం రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి.. సీఎం బావమరిదేనా? కాదా? స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates