మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు.

జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట ఫిబ్రవరి 12న రీ పోలింగ్ నిర్వహిస్తారు.

నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. ఓ వైపు సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారం, కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, మీడియా కథనాలు వంటి వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది.

ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక, ఈ మున్సిపల్ ఎన్నికలు తనకు రిఫరెండం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో జరగబోతోన్న ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.