ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాశ్వతమని, దీనిని ఎవరూ కదల్చలేరని ఆయన స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడారు.
రాజధానిని కదపడం ఎవరి వల్లా కాదన్నారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్ఠం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అమరావతే ఏపీ శాశ్వత రాజధానిగా చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
ఎందుకు?
అమరావతిపై సీఎం చంద్రబాబు ఇలా కీలక ప్రకటన చేయడం వెనుక ముఖ్యమైన కారణం ఉందని సమాచారం. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. సోమవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గం చర్చించింది.
ఈ క్రమంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కూడా కేంద్ర మంత్రివర్గం దృష్టి పెట్టింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చ జరిగిందని సమాచారం. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక్కటే ఆమోదం తెలపాల్సి ఉంది.
ఇది కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలుస్తోంది. ఇదే శనివారం కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏపీలో పర్యటించారు. బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి అంశంపై మరోసారి చర్చ జరిగింది.
ఈ మొత్తం పరిణామాలు ముందుగానే చంద్రబాబుకు తెలిసిన నేపథ్యంలోనే ఆయన అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. చట్టబద్ధత కల్పిస్తే రాజధానిని ఎవరూ కదిలించలేరన్న అభిప్రాయం ప్రభుత్వం, ప్రజల్లో బలంగా ఉంది. అందుకే అమరావతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates