టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పేసే ముక్కుసూటి నైజం చింతమనేని సొంతం. అదే తరహాలో, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా తన పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక రేపాయి. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల్లో కొందరు కోవర్టులు ఉన్నారని, భవిష్యత్తులో వారి వల్ల ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొంతమంది కోవర్టులు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. వారు టీడీపీలో ఉన్నప్పటికీ, వారి కేరాఫ్ వైసీపీ అని విమర్శించారు. అటువంటి వారిపై జాగ్రత్తగా లేకుంటే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి పార్థసారధి పరోక్షంగా స్పందించారు. టీడీపీలో చేరికల విషయంలో పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.
ఏదైనా ఒక నియోజకవర్గంలో కోవర్టులు ఉండవచ్చని, కానీ అన్ని నియోజకవర్గాల్లో కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యానిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు దెందులూరు నియోజకవర్గాన్ని ఉద్దేశించే చేసినవేనని సమాచారం.
జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు గతంలో వైసీపీలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు టీడీపీలో చేరారు. అయితే, వారితో చింతమనేని ప్రభాకర్‌కు విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కోవర్టులంటూ వారిని ఉద్దేశించే చింతమనేని ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates