గోదావరి పుష్కరాలు: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!

Chandrababu godavari

ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది.

గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే ఏడాది మరోసారి కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇవి జరగనున్నాయి.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏడాదిన్నర ముందే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ పుష్కరాలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. గోదావరి పుష్కర పనులపై తొలిసారిగా చంద్రబాబు శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై చర్చించారు.

గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు.

ఈ పుష్కరాల నిమిత్తం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఎక్కడా ఏ చిన్న లోపం జరగకుండా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

అతిరథులకు ప్రత్యేక ఆహ్వానం పలకాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల గవర్నర్లను కూడా ఆహ్వానించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి గోదావరి నేపథ్యంతో, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక ప్రత్యేక ఆహ్వాన పత్రికను రూపొందించాలని ఆదేశించారు.

అదేవిధంగా గోదావరి పుష్కరాలకు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని స్పష్టం చేశారు.

కాగా, గోదావరి పుష్కరాలపై ఏడాదిన్నర ముందే బిగ్ ప్లాన్ చేయడం గమనార్హం.