‘టీడీపీ మంత్రి వైసీపీలో చేరాలనుకున్నారు’

ఏపీలో భూసర్వే వ్యవహారంపై రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ పై రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే అనగాని సత్య ప్రసాద్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్లు ఇస్తే వైసీపీలో చేరతాను అంటూ అనగాని గతంలో చెప్పిన మాటలు మరిచిపోయినట్లున్నారని పేర్ని నాని షాకింగ్ ఆరోపణలు చేశారు.

అయితే, అనగాని చేరికను జగన్ అంగీకరించలేదని, లేదంటే ఈ రోజు తన పక్కన అనగాని కూర్చొని ఉండేవారని ఆరోపించారు. అదృష్టం బాగుండి అనగాని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మెప్పు పొందేందుకు అనగాని అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చిన పాస్‌బుక్‌లపై మంత్రి అనగాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు.

అనగాని రెవెన్యూ శాఖా మంత్రిగా ఉండటం తమ ఖర్మ అని, మంత్రి హోదాలో యోగ్యుడిగా అనగాని ప్రవర్తించాలని హితవు పలికారు. మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడుతున్నారన్నారని, జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెదడులోనూ, భావజాలంలోనూ సంస్కారంలోనూ రుగ్మతలను తగ్గించుకునేదానికి ప్రత్యేకమైన ఆస్పత్రులు ఉంటాయని చురకలంటించారు. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలోని పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో తీసేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.