హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్… సిట్ ను ప్రశ్నించిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయం ఈ రోజు విచారణ తర్వాత తేటతెల్లమైందని ఆరోపించారు. సిట్ అధికారులు పదే పదే అడిగిన ప్రశ్నలనే అడిగారని అన్నారు.

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, లీకు వీరుల ప్రభుత్వానికి బెదరబోమని అన్నారు. తమ ఫోన్లను రేవంత్ సర్కార్ ట్యాప్ చేస్తోందని తాను పోలీసులను ప్రశ్నించానని కేటీఆర్ చెప్పారు. ఆ ప్రశ్నకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని అన్నారు.

ఆ మాటనడానికే తనకు సిగ్గుగా ఉందని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని తాను ప్రశ్నించగా…అది నిజం కాదని పోలీసులు సమాధానమిచ్చారని తెలిపారు. కానీ, మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు వచ్చాయని, తమ కుటుంబాలు పడ్డ క్షోభకు బాధ్యులు ఎవరని అన్నారు.

మీడియాకు అప్పీల్ చేస్తున్నానని, ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులు అలాగే ప్రచురించవద్దని …వాస్తవాలు తెలుసుకొని రాయాలని మీడియాకు రిక్వెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోందని, లీకులు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

నేతల వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని తాను సిట్ అధికారులను ప్రశ్నించానని అన్నారు. సింగరేణి బొగ్గు టెండర్ లో అవకతవకల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.