స్పెష‌ల్‌: లోకేష్‌.. ఇంతింతై.. స‌వాల్‌గా ఎదిగి..!

ఆయ‌న.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు, మ‌రో ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీఆర్ మ‌న‌వ‌డు. కానీ.. ఆ పేర్లు కేవ‌లం ప‌రిచ‌యానికి మాత్ర‌మే ప‌రిమితం చేసుకున్నారు. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు త‌నే పేర్చుకున్న ఇటుక‌ల‌తో పునాదులు వేసుకున్నారు. అత్యంత త‌క్కువ కాలంలో ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగి ప్ర‌త్యర్థి పార్టీలకు కొరుకుడుప‌డ‌ని ఓ కీల‌క నాయ‌కుడిగా.. అతి పెద్ద స‌వాల్‌గా మారారు. ఆయ‌నే ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్‌.

నేడు(23, జ‌న‌వ‌రి) నారా లోకేష్ 43వ పుట్టిన రోజు. గ‌త 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు నారా లోకేష్‌కు రాజ‌కీయంగా ప‌రిచ‌యం లేదు. దీనికి ముందు చంద్ర‌బాబు చేసిన‌.. ‘వ‌స్తున్నా మీకోసం’ యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అయిన నారా లోకేష్‌.. ఆ యాత్ర‌ను డిజిట‌లీక‌ర‌ణ ద్వారా సోష‌ల్ మీడియాతో ప్ర‌జ‌లలోకి చొచ్చుకు పోయేలా చేశారు. త‌ద్వారా 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు తెర‌వెనుక చాలానే కృషి చేశారు.

ఇక‌, నారా లోకేష్ 2017లో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. దీనికి ముందు కూడా.. ఆయ‌న రాజకీయ ప‌య‌నం.. అనుకున్న విధంగా న‌ల్లేరుపై న‌డ‌క‌గా మాత్రం సాగ‌లేదు. ప్ర‌త్య‌ర్థుల‌ నుంచి అనేక విమర్శ‌లు.. వివాదాలు చుట్టుముట్టాయి. ఆయ‌న బాడీ షేమింగ్ నుంచి..మాట‌ల వ‌ర‌కు.. అనేక అవ‌మానాలు ఎదుర్కొన్నారు. మాట్లాడ‌డం కూడా రాదంటూ.. వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో ట్రోల్స్ చేసేవారు. ఇక‌, సొంత పార్టీలోనూ సీనియ‌ర్ల నుంచి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.

అంతేకాదు.. కొంద‌రు సీనియ‌ర్లు.. నారా లోకేష్ రాక‌ను జీర్ణించుకోలేక పోయారు. ఏం అనుభ‌వం ఉంది? అంటూ.. కొంద‌రు ప్ర‌శ్నించారు. ఇలా.. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నారా లోకేష్‌కు పుండుమీద కారం మాదిరిగా 2019లో మంగ‌ళ‌గిరిలో ఓట‌మి మ‌రింత బాధ పెట్టింది. అయితే..ఇక్క‌డే ఆయ‌న రాటు దేలారు. అప్ప‌టి నుంచి ప‌ట్టుస‌డ‌ల‌కుండా.. రాజ‌కీయ ప‌రిణితిని సాధించారు. ఈ క్ర‌మంలోనే తెలుగుపై ప‌ట్టు పెంచారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. నేడు.. కొర‌క‌రాని కొయ్య‌గా.. ప‌రిణితి చెందిన నేత‌గా.. అటు ప్ర‌త్య‌ర్థుల‌కు, ఇటు సొంత పార్టీ నాయ‌కుల‌కు కూడా ఆయ‌న కీల‌క నేత‌గా అవ‌త‌రించారు.