తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన.. ఏ పార్టీలోకి నేను చేరడం లేదంటూనే విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు.
గత ఏడాది రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారా అనే ప్రశ్నను లేవనెత్తారు. పార్టీకి, ఎంపీ పదవికి, రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నానని అప్పట్లో ప్రకటించిన ఆయన ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి రావచ్చని సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరైన అనంతరం చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ కలకలం రేపుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్‌లో సుమారు ఏడు గంటల పాటు విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే జూన్ తర్వాత రాజకీయాల్లో తిరిగి చురుకుగా వ్యవహరించే విషయంపై స్పష్టత ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పార్టీ నెంబర్ టూ స్థానం ఇచ్చారని, అయితే పనికిమాలిన కోటరీ ప్రభావంతో క్రమంగా తనను పక్కకు నెట్టేశారని విమర్శించారు. దురదృష్టవశాత్తూ జగన్ కూడా అదే కోటరీ మాటలు నమ్మారని ఆరోపించారు.
2020 నుంచే తనను పూర్తిగా సైడ్‌లైన్ చేశారని, పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నిస్తే మద్యం స్కాం ఆరోపణలను తాను నమ్మలేదని చెప్పానన్నారు. వందల కోట్ల ఆస్తులు సంపాదించానని కోటరీ తనపై తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. కుమార్తె పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తనవేనని చెప్పడం అవాస్తవమని, విశాఖలో తనకు ఒక్క అపార్ట్మెంట్ తప్ప మరే ఆస్తులు లేవని స్పష్టం చేశారు. తనపై జరిగిన దుష్ప్రచారానికి బాధ్యులైన వారికి తగిన బుద్ధి చెప్పాలని, తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తనను ఇరికించారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates