ఏపీలో వారికి సోషల్ మీడియా బ్యాన్?

సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఇక, రీల్స్..షార్ట్స్ హవా మొదలైన తర్వాత గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అయితే, పెద్దల సంగతి పక్కనబెడితే 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందుకే ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

దావోస్ పర్యటన సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే అంశంపై స్టడీ చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ ఉన్నవారు ఇలాంటి ప్లాట్ ఫామ్ లలో ఉండకూడదని, సోషల్ మీడియాలో కంటెంట్ ను వారు పూర్తిగా అర్థం చేసుకోలేరని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

అందుకే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై బలమైన, చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరం కావచ్చని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు.