గుడివాడ నియోజకవర్గం.. అనగానే… ఒకప్పుడు క్యాసినో.. జూదానికి ప్రతీక. అప్పట్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని.. నియోజకవర్గాన్ని తన అడ్డాగా చేసుకుని ముందుకు సాగారు. ఆయన ఏం చేసినా.. ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రశ్నిస్తే.. బూతులతో విరుచుకుపడిన మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే.. కాలం మారింది. ప్రజలు ఆయనను ఇంటికి పరిమితం చేశారు.
దీంతో గుడివాడలో ఇప్పుడు టీడీపీకి చెందిన వెనిగండ్ల రాము విజయం దక్కించుకుని అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదేసమయంలో గత మరకలు కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈయన హయాంలోనూ చిన్న చిన్న లోపాలు ఉన్నా.. మెజారిటీ అంశాలన్నీ కూడా ప్రజలకు అనుకూలంగానే ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నంలో ముందున్నారు.
దీనిలో భాగంగా.. ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని.. చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. గతంలో కొడాలి అనుచరులు.. ఎక్కడైతే.. క్యాసినో ఏర్పాటు చేశారో.. ప్రవీణ్ చీకోటి వచ్చి.. క్యాసినో నిర్వహించి.. కోట్ల రూపాయలను కొల్లగొట్టి.. నియోజకవర్గానికి బ్యాడ్ నేమ్ తెచ్చారో.. అక్కడే.. ఇప్పుడు అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభించారు. అది కూడా సంక్రాంతిని పురస్కరించుకుని క్యాసినో నిర్వహించిన స్థలంలో భారీ ఏర్పాట్లు చేసి.. ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ శిబిరంలో రాష్ట్రంలోని పేదలు.. మధ్యతరగతి వర్గాలకు చెందిన యువ క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా సాయం తీసుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలో ఇక్కడ శాశ్వత భవనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా.. ఇక్కడ క్యాసినో మరకలు తొలగించి.. యువ క్రీడాకారులకు శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates