ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన అనంతరం బిల్లును సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
2014 రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించగా, ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు స్వతంత్ర రాజధానిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ఖరారు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారిక నివేదికను సమర్పించింది.
రాజధాని ఎంపిక ప్రక్రియ, చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మాణాల వివరాలను కూడా కేంద్రానికి వివరించింది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా అమల్లోకి తీసుకురావాలని స్పష్టంగా విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను సేకరించింది. పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాలు కూడా త్వరలోనే అందనున్నట్లు తెలుస్తోంది.
అన్ని శాఖల సూచనలు పూర్తైన తర్వాత క్యాబినెట్ నోట్ సిద్ధం చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతిపై ఉన్న అనిశ్చితికి తెరపడనుండగా, రైతులు, పెట్టుబడిదారులకు భరోసా కలిగి రాజధాని నిర్మాణాలు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates