పాదయాత్రపై జగన్ అఫిషియల్ క్లారిటీ

మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ఈ రోజు సమావేశం అయ్యారు.

‘ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను..’ ఉంటానంటూ ఆయన వెల్లడించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో తాను భేటీ అవుతానని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఇక మిగిలింది మూడేళ్లే అని ఆయన స్పష్టం చేశారు. ‘చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే…’ అంటూ లెక్కలు చెప్పారు.

2027లో జగన్ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నాయకులు గతంలోనూ చెప్పారు. దాదాపు రెండేళ్లపాటు ఈ యాత్ర సాగుతుందని కూడా స్పష్టం చేశారు. అంటే ఎన్నికలకు ముందు సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేసినట్లు సమాచారం. దానిపైనే పార్టీ నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు.

ఓటమి తర్వాత వైసీపీ ముఖ్యనేతలను దూరం చేసుకుంది. కనీసం అసెంబ్లీకి రాకుండా.. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించకుండానే దాదాపు రెండేళ్లు గడిపేసింది. అదేమంటే ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు కార్యకర్తలలో కొంత క్రేజ్ఉంది. దానిని ఓట్లుగా మలచుకునేందుకు జగన్ ప్రణాళికలను రచిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పాదయాత్రలు చేయడం పరిపాటి.. అయితే జగన్ కు అది ప్లస్అవుతుందో లేదో చూడాలి. మరో వైపు పలు అవినీతి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. త్వరలో ఏపీలో సంచలనాలు జరగబోతున్నాయంటూ బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్కు బీజేపీ అండ లేదనే సంకేతాలను ఇస్తున్నాయి. మరో ఏడాది పాటు ఏపీ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.