ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు హరీశ్ రావును విచారణ జరిపారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీశ్ రావు…రేవంత్ రెడ్డిపై, ఆయన బావమరిదిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణం గురించి తాను బయటపెట్టిన రోజే తనకు సిట్ నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు.
అందుకుగాను రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలని, తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణంపై, ఆయన బావమరిదిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు విచారణలో ఇలా అయిందని..అలా జరిగిందని చిల్లర లీకులిస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిట్ అధికారులు తనను విచారణ చేసిన వీడియో మొత్తం బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పానని, తప్పు చేయని తాను ఎందుకు భయపడతానని ప్రశ్నించారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. సిట్టు, బొట్టు వేసుకున్నా భయపడేది లేదని, ఎక్కడకు పిలిచినా వస్తానని, ఎన్ని సార్లు పిలిచినా వస్తానని చెప్పారు. ఈ చిల్లర రాజకీయాలు చూస్తే ప్రజలకు రోత పుడుతోందని అన్నారు. తాము కేసీఆర్ సైనికులమని, పోరాటాలు తెలుసని…రేవంత్ లా కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు తెలీదని అన్నారు.
రేవంత్ కు ధైర్యముంటే బొగ్గు కుంభకోణం, పవర్ కుంభకోణం, రైతు రుణమాఫీ గురించి మాట్లాడదామని, ఎక్కడకు రమ్మన్నా వస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయం అని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు గాలికి వదిలేసి దండుపాళ్యం ముఠాలా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ దోపిడీని తాను, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నందుకే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని రేవంత్ ను దుయ్యబట్టారు. అయినా సరే బీఆర్ఎస్ గొంతులు సింహాల్లా గర్జిస్తాయని, వెనకడుగేసే ప్రసక్తే లేదని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
