కమలదళపతిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతల స్వీకారం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

 బిహార్‌కు చెందిన 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌ కమలదళపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పార్టీతో అనుబంధం ఉన్న నమ్మకమైన కార్యకర్తగా నితిన్‌ నబీన్‌కు గుర్తింపు ఉంది. ఆయన ఐదుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పలు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ సమర్థవంతంగా పనిచేశారు. నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలు సాధిస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. యోగ్యులైన వారందరికీ పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితమైన స్థితికి చేరిందని అన్నారు. నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా, నితిన్‌ నబీన్‌ ఎన్నికపై పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్‌ నబీన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేశ్‌ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఎదుగుదల దేశ రాజకీయాల్లో యువ నాయకత్వంపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.