పెట్టుబడుల వేట.. అమరావతి టూ దావోస్

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాలుగు రోజుల దావోస్ పర్యటన ప్రారంభమవుతోంది. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో నేరుగా భేటీలు నిర్వహించనున్నారు.

దావోస్ వేదికగా జరిగే ఈ సమావేశాల ద్వారా ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, టెక్నాలజీ భాగస్వామ్యాలే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక బలాన్ని, పారిశ్రామిక అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందుకు తీసుకెళ్లడంపైనే సీఎం దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఈ పర్యటనలో సీఐఐ, టాటా గ్రూప్, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, జెఎస్‌డబ్ల్యూ, ఎన్విడియా వంటి ప్రముఖ కంపెనీల అధినేతలతో చంద్రబాబు సమావేశాలు జరపనున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా ఏపీ అభివృద్ధి దిశను ప్రపంచానికి వివరించనున్నారు.

మొత్తంగా దావోస్‌లో సీఎం 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పారిశ్రామికవేత్తలతో 16 వన్ టు వన్ భేటీలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, వివిధ ప్లీనరీ సెషన్లు ఈ పర్యటనలో భాగంగా ఉంటాయి.

ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమం కూడా ఈ పర్యటనలో ముఖ్య భాగంగా ఉండనుంది. ఆ వేదికపై ఏపీ పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, దావోస్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమరావతి నుంచి దావోస్ వరకూ సాగుతున్న ఈ పెట్టుబడుల వేట, ఏపీ అభివృద్ధి దిశను ప్రపంచపటంపై మరింత బలంగా నిలబెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.