ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న కొడాలి నాని (శ్రీ వెంకటేశ్వరరావు) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే రెండు ప్రధాన చిక్కులు ఎదురవుతున్నాయి.
మొదటిది.. తానే ప్రకటించుకున్న శపథం. గత ఎన్నికల సమయంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ కొడాలి నాని శపథం చేశారు. మాట అంటే మాటే అన్నట్లుగా ఉండే నాని విషయంలో ఇదే ఇప్పుడు ఆయనకు అడ్డంకిగా మారింది. దీంతో గుడివాడ నియోజకవర్గ వ్యవహారం వైసీపీ నేతల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో సినీ రంగానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ నిర్మాత గుడివాడ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి, స్థానిక రాజకీయ లెక్కలను పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
కొడాలి నాని విషయంలో రెండో ప్రధాన అడ్డంకి ఆయన అనారోగ్యం. ఇప్పటికే అనారోగ్య కారణాలతో గత 18 నెలలకుపైగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తానని చెప్పినా, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చన్న చర్చ సాగుతోంది. మరోవైపు నానికే పోటీ చేసే ఆసక్తి తగ్గిందన్న మాట కూడా వినిపిస్తోంది.
ఈ పరిస్థితులన్నింటిని పరిశీలిస్తే, కొడాలి వ్యవహారంపై వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని బరిలోకి దించేందుకు చర్చలు జరుగుతున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
అయితే కొడాలి నానీకి పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇచ్చే ఆలోచన మాత్రం ఉందని సమాచారం. అన్ని అనుకూలిస్తే వచ్చే ఎన్నికల తర్వాత ఆయనను రాజ్యసభకు లేదా మండలికి పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదని, 2029 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం మాత్రం గుడివాడలో కొడాలి నాని పరిస్థితి అంత సానుకూలంగా లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates