జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు కూడా హర్షించరు. పైగా ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా కొన్ని పట్టు విడుపులు ప్రదర్శించింది. దీంతో పల్లెల నుంచి పట్టణాల వరకు సంక్రాంతి పండుగ సంబరాలు జోరుగా సాగాయి.

ముఖ్యంగా కోడి పందేల విషయంలో ప్రభుత్వం డింకీ పందేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైసీపీ వీటిని కూడా అడ్డుకుంది. ఫలితంగా సంక్రాంతి రోజుల్లో ఎక్కడా సందడి కనిపించలేదు. ఇది ప్రజల్లో సంప్రదాయాల పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వచ్చేలా చేసింది. దీనిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం కోడి పందేల విషయంలో చూసీ చూడనట్టే వ్యవహరించింది. అయితే కొన్నిచోట్ల కత్తులు కట్టి ఆడిన పందేల విషయంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా నగరాల్లోనూ సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫలితంగా గుంటూరు, విజయవాడ వంటి పెద్ద నగరాల్లో ఈ దఫా భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు సాగాయి. ఇక సంబరాల సమయంలో జరిగే అన్ని ముచ్చట్లు జరిగాయి. ఇది ప్రజలకు ఒకింత ఆనందాన్ని పంచిందనే చెప్పాలి. అదే సమయంలో మద్యం దుకాణాలకు ఈ మూడు రోజుల పాటు అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఇది కూడా మద్యం ప్రియులకు ఆనందం కలిగించిందనే చెప్పాలి.

నిజానికి వీటిపై చిన్నపాటి విమర్శలు ఎలానూ వస్తాయి. అయినప్పటికీ మెజారిటీ ప్రజలు, యువత ఆకాంక్షను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొంత మేరకు సంయమనం పాటించిందనే చెప్పాలి. నిజానికి ఏ ప్రభుత్వమైనా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఏపీలోనూ అదే జరిగింది. హద్దు మీరిన వారిని అదుపు చేస్తూనే సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం ఓపెన్ గేట్లు తెరవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది ప్రజల్లోనూ ఆనందాన్ని నింపింది.