కేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాట

సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ డిమాండ్ సాధనకు శాంతి ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండించిన కేటీఆర్…సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి సికింద్రాబాద్‌ ఐడెంటిటీని శాశ్వతంగా లేకుండా చేస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని, తెలంగాణ రాజముద్ర మార్చారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో జంట నగరాల అస్తిత్వాన్ని తాము ఎన్నడూ ముట్టుకోలేదని కేటీఆర్ అన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లామని చెప్పారు.

హైదరాబాద్ మహానగరంలోని 24 సర్కిళ్లను 30 సర్కిళ్లు చేశామని, 4 జోన్లను 6 జోన్లుగా విస్తరించామని తెలిపారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు, పెద్దలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీలో తాము పాల్గొన్నామని, దానిని అడ్డుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పే రాజ్యాంగ రక్షణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో మరోసారి ర్యాలీ నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు.

ఇక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ముగ్గురు మినహా మిగతా వారందరికీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. ఆయన దృతరాష్ట్రుడిగా మారిపోయారంటూ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు తనకు ఆధారాలేమీ కనబడలేదని మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.