ఏపీ మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే కబురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్రజలకు సూచించారు. అన్నట్టుగానే ఆయన తాజాగా శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. కాకినాడకు భారీ ప్రాజెక్టును ప్రకటించారు.
కాకినాడలో భారీ పెట్టుబడి రానున్నట్టు ఆయన తెలిపారు. ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 90,75,85,000,000) ప్రాజెక్టు త్వరలోనే కాకినాడలో ఏర్పాటు కానున్నట్టు ఆయన వివరించారు. ఇది కాకినాడ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నమని పేర్కొన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వంపనిచేస్తోందని నారా లోకేష్ తెలిపారు. తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇదేసమయంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కూడా మెరుగు పరుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప జిల్లాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తీర ప్రాంత జిల్లాగా ఉన్న కాకినాడకు కూడా భారీ ప్రాజెక్టు వస్తోందన్నారు.
ఏఎం గ్రీన్ కంపెనీ కాకినాడలో 10 బిలియన్ డాలర్ల(రూ. 90 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇది హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు అని.. రాబోయే రోజుల్లో ఇదే హరిత ఇంధనంగా వినియోగంలోకి రానుందని తెలిపారు.
ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయడంతోపాటు జర్మనీ, సింగపూర్, జపాన్‌కు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉన్న 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు.
అంతేకాదు.. కాకినాడ కేంద్రంగా దేశం నుంచి తొలిసారి గ్రీన్ అమ్మోనియా ఎగుమతి జరగనుందని.. ఇది రాష్ట్రానికే కాకుండా.. దక్షిణాదికే తలమానికం కానుందని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates