కేరళ కాదండోయ్.. మన ఆత్రేయపురమే..

ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. పండుగ సంబరాలు స్థానికులకే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

కేరళను తలపించే డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేయపురం వేదికగా ఘనంగా నిర్వహించడంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ పడవ పోటీలు ఆత్రేయపురం పేరును రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో చాటాయి. గోదావరి నదిపై ఉచ్చిలి నుంచి తాడిపూడి వంతెన వరకు 1000 మీటర్ల దూరంలో జరిగిన ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

మొత్తం 22 జట్లు పోటీపడగా కేరళ (అలెప్పీ), బండారు, కోనసీమ, పల్నాడు–1, కర్నూలు, ఎర్ర కాలువ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కేరళ తరహా పడవ పోటీలు స్థానికంగా నిర్వహించడంపై నిర్వాహకులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు ఆత్రేయపురం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారు పేర్కొన్నారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్లు, ముగ్గుల పోటీలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.