భారతీయులు వెంటనే అక్కడి నుండి వచ్చేయండి

భార‌త ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న జారీ చేసింది. `ఆదేశంలో మ‌న వాళ్లు ఎవ‌రూ ఉండొద్దు. ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.. వెంట‌నే వ‌చ్చేయండి“ అని ఈ ప్ర‌క‌ట‌న సారాంశం. అంతేకాదు.. భార‌త ప్ర‌భుత్వం చెప్పిన నిర్దేశిత విధానాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని కూడా ఆదేశించింది.

దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. అస‌లు ఆ దేశం ఏంటి? అక్క‌డ ఏం జ‌రిగింది? భార‌త ప్ర‌భుత్వం అంత సీరియ‌స్‌గా ఎందుకు రియాక్ట్ అయింది? ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేసి మ‌రీ మ‌న‌వాళ్ల‌ను ఎందుకు వెన‌క్కి తీసుకువ‌స్తోంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ఏంటా దేశం!

భార‌త్ ప్ర‌క‌టించిన దేశ‌మే పాకిస్థాన్‌కు స‌మీపంలో ఉన్న ఇరాన్‌. ముస్లిం కంట్రీ అయిన‌ప్ప‌టికీ.. సాంకేతిక‌త‌, వైద్య విద్య విషయంలో ఇరాన్ దూకుడుగా ఉంది. దీంతో మ‌న దేశం నుంచి అనేక మంది విద్యార్థులు విద్య‌ను అభ్య‌సించేందుకు అక్క‌డ‌కు వెళ్తారు. అదేవిధంగా ఇరాన్‌.. నిర్మాణ రంగంలో కూడా అగ్ర‌గామిగా ఉంది. ఫ‌లితంగా అక్క‌డి ప‌నుల కోసం భార‌తీయులు పెద్ద ఎత్తున అక్క‌డికి త‌ర‌లి వెళ్తారు.

అయితే.. ఇటీవ‌ల కాలంలో ఇరాన్ మార‌కం(రియాల్‌) విలువ భారీగా ప‌డిపోయింది. అమెరికా డాల‌ర్‌తో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం రియాల్‌.. ల‌క్షా 45 వేల వ‌ర‌కు ప‌లుకుతోంది. దీంతో ఆహార ప‌దార్థాలు స‌హా..నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు నింగినంటాయి.

మ‌రోవైపు.. అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా దేశాన్ని వెంటాడుతోంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో ఇరాన్ ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆహార స‌బ్సిడీని పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇది ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న పేద‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. ఇక‌,ఉద్యోగాల నియామ‌కాలు నిలిపివేసింది.

ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని కూడా పేర్కొంది. ఈ ప‌రిణామాల‌తో ఇరాన్ ఇప్పుడు అట్టుడుకుతోంది. ల‌క్ష‌లాది మంది నిర‌స‌న కారులు రోడ్ల‌పైకి వ‌చ్చి.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ధ్వంసం చేస్తున్నారు.

దీంతో ఇరాన్ ప్ర‌భుత్వం కూడా.. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆందోళ‌న కారుల‌పై కాల్పుల‌కు ఆదేశించిన‌ట్టు ప్ర‌పంచ మీడియా తెలిపింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 వేల మందికి పైగా నిర‌స‌న కారులు మృతి చెందారు. బీబీసీ క‌థ‌నంలో రోడ్ల‌పై ఎటు చూసినా.. శ‌వాల గుట్ట‌లు క‌నిపిస్తున్నాయి.

మ‌రోవైపు నిర‌స‌న‌ల‌కు అమెరికా మ‌ద్ద‌తు ఇస్తోంది. త‌గిన భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని ట్రంప్ .. నిర‌స‌న కారుల‌కు హామీ ఇచ్చారు. దీంతో ఇరాన్‌లో మ‌రింత ఉప‌ద్ర‌వం పెరిగే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం మ‌న దేశానికి చెందిన వారిని త‌క్ష‌ణ‌మే వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చింది. ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేస్తామ‌ని.. త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. ఇదీ.. సంగ‌తి!!