ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాయకులు నెరవేరుస్తారా? అంటే.. తమకు అవకాశం ఉన్న మేరకు.. తమకు ఇబ్బంది లేని హామీలను నెరవేరుస్తారు. అయితే.. ఎంత వేగంగా నాయకులు సదరు హామీలను అమలు చేస్తారన్నది.. ఇచ్చిన హామీ స్థాయిని బట్టే ఆధారపడి ఉంటుంది. కొందరు నాయకులు తమకు సులభం అనుకున్న హామీలను త్వరగా పూర్తి చేస్తారు. తద్వారా `మాకు ఓటు వేసినందుకు.. మీకు ఇచ్చిన హామీని నెరవేర్చాం` అని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో జరిగింది. అయితే.. ఈ హామీ నెరవేర్చిన సదరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. పండుగ పూట వారిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. వారు ఇచ్చిన హామీ ఏంటి? అనేది చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది.
గత డిసెంబరులో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో సర్పంచులుగా పోటీ చేసినవారు.. ప్రజలకు అనేక హామీలు గుప్పించారు. కొన్ని చోట్ల సాధారణ ఎన్నికలను తలపించాయి. డబ్బులు కూడా పంచారు.
ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో ఉన్న ఫరీద్‌పేట్, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసిన వారు.. ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు. తమను గెలిపిస్తే.. మీరు కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న వీధి కుక్కల సమస్యను తొలగిస్తామని చెప్పారు.
ఈ హామీ వర్కవుట్ అయినట్టుంది. ఆయా గ్రామాలకు చెందిన సర్పంచు అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. వారు ఇలా విజయం దక్కించుకున్నాక.. ఇచ్చిన హామీ విషయాన్ని ప్రజలు గుర్తుచేసినట్టు ఉన్నారు.
వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని ప్రజలు విన్నవించారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు.. ఏం చేశారో ఏమో కానీ.. నాలుగు గ్రామాల్లోనూ వీధికుక్కలు రాత్రికి రాత్రికి కనిపించకుండా పోయాయి. హామీ అయితే నెరవేర్చామన్న ఆనందంలో ఉన్న సర్పంచులకు ఇవే గ్రామాలకు చెందిన జంతు ప్రేమికులు కొందరు షాకిచ్చారు.
వారు వీధికుక్కలను ఏం చేశారన్న విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి వాటిని చంపేశారని.. సమీపంలోని ట్రాక్ పక్కన పూడ్చి పెట్టారని తెలుసుకున్నారు. మొత్తంగా 642 వీధికుక్కల కళేబరాలను పోలీసుల సాయంతో వెలికి తీశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచుల హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. వీరిని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates