తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా, మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.
‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యాలు, కల్పితాలతో ఉందని మంత్రి లోకేష్ ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించేలా కథనం రాశారని పేర్కొంటూ సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో పరువునష్టం దావా వేశారని తెలిపారు.
ఆ కథనంలో పేర్కొన్న తేదీల్లో తాను విశాఖలోనే లేనని, ప్రభుత్వ అతిథుల కోసం చేసిన ఖర్చును తనకు ఆపాదిస్తూ తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా అనేకసార్లు విశాఖ వచ్చినప్పటికీ ఎయిర్‌పోర్టులో ఎలాంటి ప్రొటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాదులు దొద్దాల కోటేశ్వరరావు, ఎస్వీ రమణ హాజరయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates