మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది.

సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎస్ఐపీబీ సమావేశంలో పర్యాటక రంగంపై తన మదిలో ఉన్న ప్రణాళికలను ఆయన వివరించారు

సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్ ప్రాంతం. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలన్నారు. 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలి. కాలుష్య రహిత ప్రాంతంగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఉండాలని చెప్పారు. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు అన్నారు. టూరిజం కార్పోరేషన్ మరింత బలోపేతం కావాలి. సూర్యలంక ఏపీటీడీసీ రేటింగ్ పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 

రాబోయే 15 ఏళ్లలో వెయ్యి కోట్ల ఆదాయం టూరిజం కార్పోరేషన్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. పాపికొండలు-పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.

కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు అత్యద్భుత పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం. అనంతపురం నుంచి గండికోట వరకూ టూరిజం క్లస్టర్లలో కూడా పర్యాటకానికి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. 

తిమ్మమ్మ మర్రిమాను అతిపెద్ద మర్రిచెట్టు. గూగుల్ మ్యాపింగ్ చేయండి. ఈ చెట్టుకు 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్ లను ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు.