తెలంగాణపై పవన్ స్పెషల్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జనసేన కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం నగరపాలక సంస్థ పరిధి, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో కొద్దిమంది సభ్యులతో తాత్కాలిక కమిటీలను నియమించారు. ఈ కమిటీలు ముప్పై రోజులపాటు పనిచేయనున్నాయి.

ఈ సమయంలో ప్రతి నియోజకవర్గం తో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని మూడు వందల వార్డుల్లో పర్యటించి, కనీసం ఐదుగురు క్రియాశీలక సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు.

తాత్కాలిక కమిటీల నివేదికల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా త్వరలోనే నూతన కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.