యువత పల్స్ పట్టుకున్న పవన్ కళ్యాణ్

యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో యువ రాజకీయ నేతగా కూడా యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ మద్దతును ప్రకటిస్తోంది. ఈ పరిణామం పవన్ రాజకీయ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

యువత ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని ఆయన ప్రసంగాలు చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ‘డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ప్రేరణగా మారుతున్నాయి. రాజకీయ వ్యవస్థలో మార్పు యువత చేతుల్లోనే సాధ్యమన్న సంకేతాలను ఆయన తరచూ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు యువత అభిమానుల ఫాలోయింగ్‌కు ఎలాంటి కొదవ లేదని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఆ అభిమానమే గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయంగా ఆయనకు కొంత మేరకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో తెలంగాణలోనూ జనసేన కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో పవన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో పార్టీ నిర్మాణం పూర్తిగా యువతపై ఆధారపడి ఉంటుందని పవన్ భావిస్తున్నారు. ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ‘తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు. అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్నిస్తాయి. జనసైనికులు తెలంగాణ భవిష్యత్తు కావాలి’ అంటూ పిలుపునివ్వడం, అక్కడ బలమైన యువ నాయకత్వాన్ని నిర్మించాలన్న ఆయన ఆలోచనలకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.