బీఆర్ఎస్ మాజీ మంత్రి, సీనియర్ నేత.. హరీష్‌రావుపై ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఆమె హరీష్‌రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సూర్యాపేటలో పర్యటించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ కేంద్రంగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ‘గుంటనక్క’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకుల వైఖరిని కవిత తప్పుబట్టారు. ముఖ్యంగా సభలో హరీష్‌రావు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడుచుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ‘తోకే కుక్కను ఊపినట్టు’గా ఉందంటూ.. మరింత ఘాటు విమర్శలు చేశారు. శనివారం నాటి సభలో హరీష్‌రావుపై కాంగ్రెస్ సభ్యులు వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. దీంతో హరీష్ సూచనల మేరకు బీఆర్ఎస్ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
దీనిని కవిత తప్పుబట్టారు. హరీష్ చెప్పగానే.. వస్తారా? అని ప్రశ్నించారు. హరీష్ ఓ గుంటనక్క.. అని వ్యాఖ్యానించారు. ఆయన వల్లే పార్టీ నాశనం అయిందని ఆరోపించారు. కీలక బిల్లులపై చర్చ జరుగుతుంటే.. హరీష్‌రావు ఉద్దేశ పూర్వకంగానే రచ్చ చేసి బయటకు వచ్చారని ఇది బీఆర్ఎస్‌కు నష్టం కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారు.” అని కవిత దుయ్యబట్టారు.
హరీష్‌రావును నమ్ముకుంటే.. అందరూ మూసీలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. కృష్నా జలాల పంపకాల్లో అన్యాయం చేసిందే హరీష్‌రావు అని ఆమె ఆరోపించారు. గతంలో ఆయన చేసిన సంతకం కారణంగానే.. ఇబ్బందులు వచ్చాయన్నారు. తన ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారు. హరీష్ రావు నిర్ణయాలతోనే ప్రాజెక్టులు మట్టికొట్టుకుపోయాయి” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates