‘రేవంత్ సీఎం కాదు స్ట్రీట్ రౌడీ’

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై వాడీవేడి చర్చ జరిగింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.

దీంతో, బీఆర్ఎస్ సభ్యులు సభను బాయ్ కాట్ చేసి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు, స్పీకర్ గడ్డం ప్రసాద్ లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది కంటే ముందు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలంటూ హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువైందని విమర్శించారు. శాసన సభను గాంధీభవన్ గా, సీఎల్పీ మీటింగ్ గా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతగాక, ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాదిరిగా, సీఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన విధంగా, బహిరంగ సభలో మాట్లాడినట్లుగా శాసన సభలో రేవంత్ సొల్లు మాట్లాడారని విమర్శించారు. మూసీకి తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లు కూల్చడానికే తాము వ్యతిరేకమని అన్నారు.

ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, మూసీ ప్రక్షాళన మొదలుబెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ఇక, తమకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రి బాడీ షేమింగ్ కు దిగుతున్నారని, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక స్ట్రీట్ రౌడీవా అంటూ రేవంత్ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

వీధి రౌడీలు కూడా రేవంత్ కంటే మంచిగా మాట్లాడతారని అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద పదే పదే చావు భాష వాడుతున్న రేవంత్ ను తెలంగాణ ద్రోహి అని, నీళ్ల ద్రోహి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.