2025లో జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంటుగా ఉన్న అనేక అంశాలపై .. కేంద్రంలోని బీజేపీ పెద్దలు దాడి చేస్తున్నారన్న వాదన స్పష్టంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తల పునాదులు ఉన్నప్పటికీ.. దీనికి తోడు.. అంతే బలమైన గాంధీ-నెహ్రూల వారసత్వ సెంటిమెంటు కూడా.. కలిసి వస్తోంది.
కానీ, చిత్రంగా ఈ సెంటిమెంటుపైనే బీజేపీ ఈ ఏడాది మొత్తం దాడి చేసింది. ఇంటా బయటా కూడా.. కాంగ్రెస్ పార్టీని ఏకేసేందుకు.. బీజేపీ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు.. బలమైన ఆయుధాలుగా మార్చుకుంది. ప్రధానంగా పార్లమెంటులో ఏ చర్చవచ్చినా.. నెహ్రూను మోడీ కార్నర్ చేసుకున్నారు.
2025 ప్రారంభం నుంచి చివరి వరకు.. పలు అంశాలపై చర్చ జరిగింది. మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ ఉభయ సభల్లో చర్చ చేపట్టినప్పుడు.. బీజేపీ ఇరుకున పడుతుందని అనుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పబట్టే నిలిపి వేశారన్న విమర్శలు వచ్చిన దరిమిలా.. ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
కానీ, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది. నెహ్రూ కారణంగానే చైనాతో యుద్ధం వచ్చినప్పుడు.. మనం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని.. నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం కారణంగానే.. భారత్ పాకిస్థాన్‌కు భూమి ఇవ్వాల్సి వచ్చిందని కౌంటర్ ఇచ్చింది.
ఇక, ఇటీవల కూడా వందేమాతరంపై చర్చించినప్పుడు నెహ్రూ టార్గెట్‌గా.. మోడీ నిప్పులు చెరిగారు. వందేమాతరాన్ని అవమానించారని తెలిపారు. ఒక మతానికి కొమ్ముకాసి.. భారతీయుల ఆత్మౌగౌరవాన్ని శంకించారని వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో నెహ్రూను ద్రోహిగా పేర్కొన్నారు.
ఇక, తాము తెచ్చిన చట్టాలు.. చేసిన నిర్ణయాలపై మాట్లాడినప్పుడు.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ విధించిన రోజును `చీకటి రోజు`(డార్క్ డే)గా పేర్కొంటూ.. బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే వీటిని సమర్థవంతంగా నిలువరించడంలోనూ.. కౌంటర్లు ఇవ్వడంలోనూ .. కాంగ్రెస్ విఫలమైందన్న వాదన వినిపించింది.
తాజాగా..
తాజాగా కూడా.. బీజేపీ కాంగ్రెస్‌ను వదిలిపెట్టలేదు. డిల్లీలోని ప్రధాన మంత్రి మ్యూజియంలో ప్రదర్శించేందుకు దేశ తొలి ప్రధానిగా నెహ్రూ విదేశాలకు.. వ్యక్తులకు రాసిన సుమారు 2 లక్షల లేఖలను తమకు ఇవ్వాలని.. బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవి వ్యక్తిగతం కావని.. నెహ్రూ ప్రధాన మంత్రి హోదాలో రాశారు కాబట్టి అవి జాతి సంపదని బీజేపీవాదిస్తోంది.
అయితే… దీని వెనుక.. నెహ్రూను మరింత డిఫేమ్(అవమానించడం) చేయడమే లక్ష్యంగా బీజేపీ పపెట్టుకుందన్న వాదనా వినిపిస్తోంది. అలాగని కాంగ్రెస్ తోసిపుచ్చలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. అవి వాస్తవానికి వ్యక్తిగతం కాదు కాబట్టి. మొత్తంగా 2025లో బీజేపీ నేతలు.. చాలా వ్యూహాత్మకంగా.. కాంగ్రెస్ సెంటిమెంటుపై ఫైట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates