రాష్ట్రంలో అయినా.. దేశంలో అయినా.. పాలకులపై ప్రజల్లో అసంతృప్తి ఎప్పుడు పెల్లుబుకుతుంది? అంటే.. చెప్పడం కష్టమేమీ కాదు. ఓ రెండేళ్ల పాలన తర్వాతో.. మూడేళ్ల పాలన తర్వాతో సహజంగానే పాలకుల విధానాలపై ప్రజల్లో అసంతృప్తి..సంతృప్తులను కొలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, చిత్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కేవలం నెలల వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ప్రకటనలు.. వంటివి తీవ్రస్థాయిలో కుదిపేశారు. ఒకానొక దశలో దేశం మొత్తం.. రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపింది. ప్రాంతాలు.. పార్టీలతో కూడా సంబంధం లేకుండా ప్రజలు నిప్పులు చెరిగారు. ప్రధానంగా 3 అంశాలు ట్రంప్ పాలనపై మచ్చలు-మరకలు పడేలా చేశాయి.
1) విదేశాంగ విధానం: అప్పటి వరకు ఉన్న విదేశాంగ విధానాన్ని.. ట్రంప్ అనధికారికంగా మార్చేశారు. దీంతో సొంత మిత్రులు ఎలాన్ మస్క్ సైతం.. వ్యతిరేకంగా మారిపోయారు. వాస్తవానికి 2025 జనవరిలోనే ట్రంప్ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. అప్పటి వరకు ఆయనకు మిత్రుడిగా ఉన్న మస్క్.. తర్వాత ట్రంప్ వ్యవహారంతో వెనక్కి తగ్గారు. తనకు ఇచ్చిన పదవిని కూడా ఆయన వదులుకున్నారు. ఇక, అప్రకటిత విదేశాంగ విధానం మేరకు..తమ మాటే వినాలన్న మంకు పట్టుతో ముందుకు సాగడం.. ప్రపంచ దేశాలపై సుంకాల వడ్డింపుతో నడ్డి విరిచే ప్రయత్నం చేయడం ట్రంప్‌కు ససేమిరా అచ్చిరాలేదు.
2) శాంతి కోసం: నోబెల్ శాంతి పురస్కారం కోసం.. ట్రంప్ వేయని ఎత్తుగడలు లేవంటే.. ఈ ఏడాది ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అనేక రూపాలలో ప్రయత్నం చేశారు. గాజా-హమాస్‌ల మధ్య దాడులు ఆపానని.. భారత్-పాక్ మధ్య వచ్చిన ఆపరేషన్ సిందూర్‌ను తానే నిలువరించానని, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కూడా తానే సంధిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తాను నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాలా అర్హుడినని యాగీ చేశారు. అంతేకాదు.. తనకు కనుక శాంతి పురస్కారం ఇవ్వకపోతే.. ఆ పురస్కారానికే ‘శాంతి’ ఉన్నట్టుగా అర్థం ఉండదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎన్ని చేసినా.. ఆయనకు ఆ పురస్కారం దక్కలేదు. దీంతో ఫిఫా వరల్డ్ కప్(2026) షెడ్యూల్ రోజు.. కొత్త ఫిఫా శాంతి పురస్కారాన్ని సృష్టించి.. దానిని అందుకు మురిసిపోయారు.
3) పెల్లుబికిన ప్రజాగ్రహం: అమెరికా చరిత్రలో ప్రజలు తొలిసారి రోడ్లపైకి వచ్చి.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది.. ఆయనను గద్దె దిగమని డిమాండ్ చేసింది కూడా.. ఈ ఏడాదే కావడం గమనార్హం. విదేశాలపై సుంకాలు వేస్తున్నానని.. ప్రపంచ దేశాలన్నీ తన మాట వినాల్సిందేనని చెప్పిన ట్రంప్.. దేశీయంగా ప్రజలు ధరాభారంతో కుంగిపోతున్న విషయాన్ని విస్మరించారు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు.. అంతిమంగా అమెరికన్లపైనే ప్రభావంచూపించాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ట్రంప్ సుంకాలపై స్థానికంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. మొత్తంగా ఈ ఏడాది కాలంలో ట్రంప్ ప్రత్యేకంగా సాధించింది లేదు.పైగా.. నిలకడలేని మనస్తత్వం.. పాలన వంటివి స్పష్టం చేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates