తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి 2025లో ఏం జరిగింది? 2023లో ఎదురైన పరాభవం, పరాజయం తర్వాత పార్టీ ఏమైనా పుంజుకుందా? లేక మరింత వెనుకంజలోనే ఉందా? అనేది ఆసక్తికరం. ఈ క్రమంలో కీలకమైన ఐదు ఘట్టాలను చర్చిస్తే పార్టీ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది.
1) ఉన్న సీటును కోల్పోవడం:
ఒకవైపు 2023లో బీఆర్ ఎస్ తరఫున గెలిచిన 10 మంది పార్టీకి దూరమయ్యారు. దీనిపై పోరాటం చేస్తున్న పార్టీకి ఈ ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత షాకిచ్చింది. ఈ స్థానాన్ని పార్టీ కోల్పోయింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో పార్టీకి ఉన్న పట్టుపై చర్చ తెరమీదికి వచ్చింది.
2) సొంత ఇంట్లోనే కుంపట్లు:
కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీపై నిప్పులు చెరగడం, ‘డియర్ డాడీ’ లేఖ, కేసీఆర్‌ను దేవుడితో పోల్చి ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. దీని వల్ల కేసీఆర్ కుటుంబంలోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి బలహీనపడింది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అందుకే బలమైన జిల్లాల్లోనూ పార్టీ మద్దతుదారులు పరాజయం పాలయ్యారు.
3) కేసీఆర్ వ్యూహ లోపాలు:
పార్టీ అధినేతగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా కేసీఆర్‌కు రాష్ట్రం నుంచి కేంద్రం వరకూ మంచి పేరుంది. పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన గడిపిన అనుభవాన్ని తక్కువగా చూడలేం. కానీ 2023 తర్వాత కేసీఆర్ వ్యూహాల లేమితో ఇబ్బంది పడుతున్నారన్న వాదన బహిరంగంగానే వినిపిస్తోంది. ఫలితంగా జూబ్లీహిల్స్ ఓటమి, కవిత వ్యక్తిగత విమర్శలు, పార్టీపై చేసిన వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారన్న అభిప్రాయం ఉంది.
4) చుట్టుముట్టిన కేసులు:
2025లో బీఆర్ ఎస్‌ను కేసులు కూడా చుట్టుముట్టాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన పలు కార్యక్రమాలపై, ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల వ్యవహారంలో అక్రమాలపై సీపీ ఘోష్ కమిషన్ నేరుగా కేసీఆర్‌ను విచారించడం, ఆయనపై 6000 పేజీలకు పైగా నివేదిక ఇవ్వడం, దీనిపై ప్రభుత్వం సీరియస్ కావడం వంటి పరిణామాలు కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
5) అదే బలం:
ఎన్ని లోపాలు ఉన్నా, ఎంత వెనుకబాటు ఎదురైనా కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న సింపతి, రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన చేసిన కృషి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ ప్రజల్లో కేసీఆర్ ఇమేజ్ పెద్దగా తగ్గలేదు. ఇదొక్కటే బీఆర్ ఎస్‌కు మిగిలిన బలం. అయితే ఆయన ప్రజల మధ్యకు రాకుండా ఈ ఏడాది మొత్తం కేవలం రెండు సార్లు అసెంబ్లీకి, మరో రెండు సార్లు జిల్లాలకు మాత్రమే రావడం పార్టీకి మైనస్‌గా మారింది. దీనిని తగ్గించి ప్రజల్లో ఎక్కువగా తిరిగి ఉంటే ఈ ఏడాది పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates