గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గిరిజనుల డోలీ మోతలకు చరమగీతం పాడే దిశగా పవన్ అడుగులు వేశారు. గిరిజన గ్రామాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపట్టడం, తద్వారా గిరిజన గ్రామాలను ప్రధాన మార్గాలతో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పల్లె పండగ 2.0 లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో 8,571 కి.మీ కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 5,838 కోట్లు కేటాయించారు.
375 కోట్ల రూపాయలతో 25 వేల మినీ గోకులాలు, 16 కోట్ల రూపయలతో 157 కమ్యూనిటీ గోకులాలు, 4 కోట్ల రూపాయలతో 58 కి.మీ మేర మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేశారు. గిరిజనుల పశుసంవర్ధన, నీటి నిర్వహణకు అవి సహాయపడతాయి. గిరిజనులకు మెరుగైన రవాణా, వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు అందించేందుకు పవన్ అహర్నిశలు పాటుబడుతున్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన గిరిజన ప్రాంతాలను పవన్ అభివృద్ధి చేస్తున్నారు.
ఇక, గిరిజనుల కోసం విశాఖలో నిర్వహించిన పీఈఎస్ఏ మహోత్సవ్ విజయవంతమైంది. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం (1996 PESA Act) ఆమోదించిన డిసెంబరు 24వ తేదీని పీఈఎస్ఏ డేగా జరుపుకుంటారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో 10 పీఈఎస్ఏ రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు. పవన్ ఆధ్వర్యంలో ఏపీలో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
ఇక, పవన్ కొడుకు సింగపూర్ లో గాయపడిన సందర్భంలో ముందు గిరిజనులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే సింగపూర్ వెళ్లారు. ఇది పవన్ కు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఇలా, గిరిజనులకు అండగా పవన్ చేస్తున్న కృషి చూస్తుంటే గిరిజన ప్రాంతాల్లో జనసేనకు ఓటు బ్యాంకు భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంకుకు పవన్ గండి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో కూడా గిరిజనులు అత్యధికంగా వైసీపీకే ఓటు వేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై సీఎం చంద్రబాబు సైతం కొన్ని సార్లు ప్రస్తావించారు. అయినా కూడా రాజకీయాలను పక్కనపెట్టి, వారికోసం ఇంతలా పనిచేస్తున్న పవన్ పై గిరిజనులకు ప్రేమ, నమ్మకం కలిగాయని.. ఇప్పటి నుండి గిరిజనుల్లో జనసేన ఓటు బ్యాంకు పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates