ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడ నగరం పాలనకు కీలకంగా మారింది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కోరారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి సీఎం చంద్రబాబుతో భేటీ అయిన చిన్ని ఆ విషయంపై మాట్లాడారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు అందజేశారు. దీర్ఘకాలంగా గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉందని, తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బెజవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాలు విలీనమైతే గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటవుతుందని వివరించారు. దాని వల్ల పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ఆ క్రమంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య పాలనాపరమైన విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తున్నాయని, జీవీఎంసీ ఏర్పాటైతే వాటికి చెక్ పెట్టవచ్చని వివరించారు. ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates